షకలక శంకర్ “శంభో శంకర” రివ్యూ

0
1332

జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన ష‌క‌ల‌క శంక‌ర్‌…. తర్వాత పలు చిత్రాల్లోనూ కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కమెడియన్ నుండి హీరోగా టర్న్ అయిన వారి జాబితాలో తాజాగా శంకర్ కూడా చేరిపోయారు. శంకర్‌ను హీరోగా, శ్రీధ‌ర్‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఆర్. ఆర్. పిక్చ‌ర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘శంభో శంకర’. U/A సెన్సార్ స‌ర్టిఫికెట్ పొందింది. ఈ రోజు ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందొ మన సమీక్షలో చూద్దాం.

ఆలీ, సునీల్ లాంటి హీరోలు సక్సెస్ కావడానికి కారణం ఎంత మాస్ సినిమా చేసినా అందులో హాస్యానికి లోటు లేకుండా చూసుకునే వారు. కానీ శంభో శంకరలో మాత్రం దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి హీరోయిన్ తో లవ్ ట్రాక్, డ్యూయెట్లు, విలన్ తో ఛాలెంజ్, పోలీస్ స్టేషన్ లో ఫైట్లు, జనాన్ని వెంటేసుకుని హీరో ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లడం ఇదంతా ఓవర్ ది బోర్డు హీరోయిజమే అవుతుంది.

కథ విషయానికి వస్తే శంకర్ (షకలక శంకర్) నిజాయితీ కల యువకుడు. ఎస్సై ఉద్యోగం చేసి సమాజాన్ని ఉద్దరించాలనే తలంపుతో ఉంటాడు. అంతేకాకుండా ఊరి జమీందార్ ఆగడాలను ఎదురిస్తుంటాడు. ఎస్సై ఉద్యోగం కోసం వెళితే చేదు అనుభవం ఎదురవుతుంది. ఈ క్రమంలో తన చెల్లెలు దారుణ హత్యకు గురి అవుతుంది. తన చెల్లెలి మరణానికి కారణమైన జమీందార్‌ అంతు చూస్తానని హెచ్చరిస్తాడు. శంకర్‌లోని తెగువను చూసి జిల్లా ఎస్పీ స్వయంగా ప్రత్యేక అధికారాలు ఇస్తాడు.

శంకర్ బాడీ లాంగ్వేజికి అనుగుణంగానే పక్కా రొటిన్ స్టోరీని దర్శకుడు శ్రీధర్ అల్లుకొన్నాడు. మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకొనేందుకు రెగ్యులర్ ఫార్మాలనే అనుసరించాడు. తొలిభాగంలో శంకర్‌తో ఫైట్లు, పాటలు, మోతాదు మించిన డైలాగ్స్‌తోనే ముందుకెళ్లాడు. చెల్లెలు మరణం తర్వాత రెండు భావోద్వేగమైన సన్నివేశాలతో ఇంటర్వెల్ కార్డు వేశాడు. అప్పటివరకు పరమ రొటీన్‌గా ఉందనుకునే ఆడియెన్స్‌కు ఓ కిక్కెంచే ప్రయత్నం చేశారు. ఇక సెకండాఫ్‌లో రైతులు, గ్రామ సమస్యలు పరిష్కరించే అంశాలతో, జమీందార్ ఆగడాలకు అంతం పలికే సన్నివేశాలతో కథ సాగుతుంది. సినిమా రెండో భాగంలో సమకాలీన పరిస్థితులపై దృష్టిసారించారనే ఫీల్ కలుగుతుంది. కాకపోతే కథను బలంగా చెప్పలేకపోవడం కొంత నిరాశకు గురిచేస్తుంది.

మొత్తం మాస్ మాసాలతో గ్రామీణ నేపధ్యంలో అజయ్ ఘోష్ లాంటి ఒక భారీ విలన్, పల్లెటూరి వాతావరణం, ఊరికో పెద్ద సమస్య, దాన్ని తీర్చేందుకు నడుం బిగించిన మన హీరో ఇలా పక్క కమర్షియల్ యాంగిల్ లో వెళ్ళిపోయి శంకర్ బలమైన కామెడీని కూడా పూర్తిగా ఈ సినిమాలో శ్రీధ‌ర్‌ వాడుకున్నట్టు మనకు కనిపిస్తుంది. పైగా పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ ని ఇమిటేట్ చేయటంతో పాటు అదే పనిగా ఎర్ర కండువా గొప్పదనం గురించి డైలాగ్ చెప్పించడం శంకర్ స్టైల్ కి అంతగా అతకలేదనే చెప్పాలి. హీరోయిన్ కారుణ్య చాలా మామూలుగా ఉంది . నాగినీడు, అజయ్ ఘోష్ అన్ని సినిమాల్లో చూసినటువంటి పాత్రలే.

షకలక శంకర్‌ను హీరోగా పరిచయం చేయడానికి ఎలాంటి ప్రయోగాలకు వెళ్లకుండా కొత్త సీసాలోనే పాత సారాను పోసి రూపొందించిన చిత్రం శంభో శంకర. విభిన్న చిత్రాలను కోరుకునే వారికి కొంత అసంతృప్తి ఉంటుంది. తన కామెడీని ఆనందించే వారికి షకలక శంకర్ డ్యాన్సులు, ఫైట్లు, ఎమోషనల్ టాలెంట్‌తో అదనంగా బోనస్ ఇచ్చారని చెప్పవచ్చు. మరి ఇంత రిస్క్ తీసుకుని తెరకెక్కించిన శంభో శంకర జాతకం BC సెంటర్ల మీదే ఆధారపడి ఉంది. ఈ నగరానికి ఏమైందితో పోటీ పడుతున్న శంభో శంకరకు బరిలో పెద్ద హీరోల సినిమాలు ఏవి లేకపోవడం ఈ సినిమాకు మంచి ఫలితం రాబట్టే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here