‘#RRR’ కథ చెప్పేసిన SS రాజమౌళి

0
139

ఎన్టీఆర్, రామ్‌చరణ్ మల్టీస్టారర్‌‌లో ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ‘బాహుబలి’ తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ సినిమాపై ఎన్నో రూమర్లు వస్తూనే ఉన్నాయి. హీరోయిన్లు, నటీనటులు, టెక్నీషియన్స్ విషయంలో వచ్చిన వదంతులన్నింటినీ యూనిట్ కొట్టిపారేసింది. తాజాగా గురువారం ‘ఆర్ఆర్ఆర్’ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సినిమా కథతో పాటు అన్ని విషయాలు మీడియాకు వివరించారు రాజమౌళి. ఈ సినిమాలో యువ అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, యువ కొమరంభీంగా ఎన్టీఆర్ నటిస్తున్నారని చెప్పారు.

‘1897 లో ఆంధ్ర ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు పుట్టారు. చదువుకోవడంతో పాటు ఆయన అన్ని విషయాల్లో చురుకుగా ఉండేవారు. యుక్త వయసులో ఉండగా ఆయన ఇల్లు వదిలి వెళ్లిపోయారు. రెండు సంవత్సరాల పాటు ఎక్కడున్నారో తెలీదు. ఇంటికి తిరిగొచ్చాక స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తరువాత బ్రిటీష్ వాళ్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. అలానే 1901 లో తెలంగాణాలోని ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం పుట్టారు.

ఆయన కూడా యుక్త వయసులో ఇంటి నుండి వెళ్లిపోయారు. అలా వెళ్లిన తరువాత ఆయన ఏం చేశారనేది ఎవరికీ తెలియదు. తరువాత తిరిగొచ్చి గిరిజనుల స్వాతంత్ర్యం కోసం పోరాడారు. గెరిల్లా పోరాటంలో పాల్గొన్నారు. ఆయన కూడా బ్రిటీషర్ల చేతులో చనిపోయారు. ఇద్దరూ ఒకే కాలంలో పుట్టడం, ఇంటి నుండి వెళ్లిపోవడం, తిరిగొచ్చి ఒకేవిధంగా పోరాడి అమరులు కావడం అనేది నాకు ఆశ్చర్యం కలిగించింది. నా కథ ఈ క్యారెక్టర్లకు దగ్గరగా ఉండబోతుందని’ అని చెప్పారు.

రామ్ చరణ్ కి జంటగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుంది అని అలాగే ఎన్టీఆర్ కి జంటగా హాలీవుడ్ హీరోయిన్ Daisy edgar jones నటిస్తుంది అని రాజమౌళి చెప్పారు. ‘ఇలాంటి పెద్ద హీరోలు ఉన్న సినిమాకి సపోర్టింగ్ కాస్ట్ కూడా ఉండాలి. అజయ్ దేవగన్ గారు సినిమాలో కీలకపాత్రలో నటించడానికి ఒప్పుకున్నారు. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో ఆయన నటిస్తున్నారు. ‘RRR’ కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే. అయితే ఇదే టైటిల్‌గా బావుందని అంటున్నారు. అన్ని భాషల్లో ఇది కామన్‌గా ఉంటుంది. కానీ ఒక్కో భాషలో ఒక్కో టైటిల్ ఉంటుంది. నా సినిమాలో యంగ్ అల్లూరి సీతారామరాజుగా చరణ్, యంగ్ కొమరం భీంగా తారక్ కనిపించబోతున్నారు” అని చెప్పారు రాజమౌళి.

ఈ ప్రెస్ మీట్‌లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘నేను ఇంకా రియాలిటీలోనూ ఇది నిజమా కాదా అని అనిపిస్తుంది. ఎప్పటి నుండో రాజమౌళితో పనిచేయాలని ఉంది. అయితే నాకు బాగా నచ్చే వ్యక్తి ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. రాజమౌళి ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఆయన ఇంటికి వెళ్లాను. వెళ్లగానే జూనియర్ ఎన్టీఆర్ కనిపించారు. అదేంటి ఈయన ఉన్నారు ఏంటి అనుకున్నాను. ఇద్దరం ఒకరి ముఖం ఒకరు చేసుకున్నాం.. కొంచెంసేపయ్యాక.. మా ఇద్దర్నీ లోపలికి తీసుకువెళ్లి.. ఈ కథను చెప్పారు. ఖచ్చితంగా మీతో సినిమా చేస్తున్నాం అని ఆయనతో చెప్పాం. ఆ ఆనందంలో తీసిన ఫొటోనే అప్పట్లో మీతో షేర్ చేసుకున్నాం. ఈ ఫిక్షనల్ స్టోరీ.. చాలా జాగ్రత్తగా చేస్తున్నాం. మా కాంబినేషన్‌లో వచ్చిన పాత చిత్రాలను మించి ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది’ అని అన్నారు రామ్ చరణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here