ఢిల్లీ నుంచి ఎంపీగా బరిలోకి గౌతమ్ గంభీర్!

0
535

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ రాజకీయాల్లోకి వచ్చారు. శుక్రవారం ఆయన భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. కేంద్ర మంత్రులు అరుణ జైట్లీ, రవిశంకర్‌ ప్రసాద్‌ల సమక్షంలో కమలం తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి గంభీర్‌ను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గంభీర్‌ మాట్లాడుతూ దేశానికి సేవ చేసేందుకు ఇదో చక్కని వేదిక అని అన్నారు. ప్రధాని మోడీ విజన్‌ నచ్చే బీజేపీలోకి చేరానని.. ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవంగా భావిస్తున్నానని గంభీర్ తెలిపారు.

ఇదిలా ఉంటే గంభీర్‌‌కు ఢిల్లీ ఎంపీ టిక్కెట్‌ ఇచ్చే అవకాశాలున్నాయి. న్యూఢిల్లీ పరిధిలో మొత్తం ఏడు లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఢిల్లీలోని రాజేంద్ర నగర్ ప్రాంతంలో గంభీర్ నివసిస్తున్నారు. రాజేంద్ర నగర్ న్యూఢిల్లీ లోక్ సభ పరిధిలోకి వస్తుంది. దీంతో అదే సీటుని గంభీర్‌కు కేటాయించవచ్చని తెలుస్తోంది. 2014లో మీనాక్షి లేఖి ఇక్కడి నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఈ సారి ఆమెకు బదులుగా గంభీర్ కు టికెట్ ఇవ్వవచ్చని తెలుస్తోంది.

దూకుడైన ఓపెనర్‌గా పేరున్న గౌతమ్ గంభీర్ 2007 టీ20 ఫైనల్, 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ల్లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ధోని నేతృత్వంలో భారత్‌ ఈ రెండు కప్పులూ గెలిచిన సంగతి తెలిసిందే. గంభీర్‌ భారత్‌ తరపున 58 టెస్ట్‌లు, 147 వన్డేలు, 37 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. 2004 నుంచి 2016 వరకు అతడి కెరీర్‌ దిగ్విజయంగా సాగింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో గంభీర్ 41.95 సగటుతో 4,154 పరుగులు చేశాడు. 9 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 10,000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో గంభీర్‌ కూడా ఒకడు కావడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here