ఈ నగరానికి ఏమైంది మూవీ రివ్యూ

0
1101

పెళ్లి చూపులు సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న తరుణ్‌ భాస్కర్‌. కాస్త గ్యాప్‌ తీసుకొని మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పక్కా యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కి అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్‌ కూడా సినిమా మీద హైప్‌ క్రియేట్‌ చేశాయి. ఈ సినిమాలో సిమ్రన్ చౌదరీ, అనీషా అంబ్రోస్ హీరోయిన్స్ గా నటించారు. నలుగురు కొత్త కుర్రాళ్లతో తరుణ్ చేసిన ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అయ్యింది అన్నది ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ:

ఈ నగరానికి ఏమైంది? సినిమా ఒక నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ (విశ్వక్ సేన్ నాయుడు), కార్తిక్ (సుశాంత్ రెడ్డి), కౌశిక్ (అభినవ్ గోమఠం), ఉపేంద్ర (వెంకటేష్ కాకుమాను)లు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్‌ తాను పనిచేస్తున్న క్లబ్‌ ఓనర్‌ కూతురిని పెళ్ళి చేసుకొని అమెరికాలో సెటిల్‌ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్‌ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్‌ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాసెట్స్‌ ఎడిటింగ్‌ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్‌ దర్శకుడిగా ఎదగటానికి షార్మ్‌ ఫిలింస్ తీసి ప్రూవ్‌ చేసుకుంటాడా? కార్తీక్‌కి ఓనర్‌ కూతురితో పెళ్లి చేసుకుంటాడా?. అసలు ఈ నలుగురు గోవా ఎందుకు వెళ్లిపోతారు. గోవా లో నలుగురు స్నేహితులు ఏం చేశారు..? ఈ ప్రయాణం వారికి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది.? ఈ ట్రిప్ తరువాత వారు ఎలా మారిపోయారు? అన్నదే మిగతా కథ.

నటీనటులు

నలుగురు కొత్త కుర్రాళ్లే కాబట్టి వారి నుండి తరుణ్ మంచి అవుట్ పుట్ తీసుకున్నాడు. లీడ్ రోల్ గా విశ్వక్ సేన్ మంచి నటన కనబరిచాడు. కౌశిక్ పాత్రలో చేసిన అభినవ్ గోమఠం కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్స్‌తో ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌ తో ఆకట్టుకున్నాడు అభినవ్‌. మిగతా పాత్రలన్ని సహజ నటనతో ఆకట్టుకున్నారు. వివేక్ లవర్స్ గా చేసిన సిమ్రాన్, మోడ్రన్ అమ్మాయిగా అనీషా ఆంబ్రోస్‌ అందం, అభినయంతో ఆకట్టుకుంది.

విశ్లేషణ :

నలుగురు యువకుల కథతో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా పక్కా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. పెళ్లిచూపులు లాంటి క్లాస్‌ సినిమా తరువాత ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్ గా తెరకెక్కించి తరుణ్ భాస్కర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ప్రస్తుత యువత ఆలోచనలకు అద్దం పట్టేలా కథ, కథనాలు ఉన్నాయని చెప్పొచ్చు. సినిమా మొదటి భాగం అంతా సరదాగా సాగుతుంది.. అయితే సెకండ్ హాఫ్ కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. అయితే కథ, కథనాల్లో ఇన్వాల్వ్ అయితే ఏమి అనిపించదు. ముఖ్యంగా యూత్ ఆడియెన్స్ కోసమే ఈ సినిమా వచ్చిందని చెప్పాలి. నలుగురు కొత్తవాళ్లే అయినా బాగా చేశారు.

వివేక్‌ సాగర్ అందించిన పాటలు పరవాలేదనిపించినా.. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా కథ, కథనాల్లో దర్శకుడు మరోసారి తన పనితనం చూపించాడు. రన్ టైం కూడా కలిసి వచ్చే అంశమే. మొత్తానికి పెళ్లిచూపులు తర్వాత ఆ హిట్ మేనియాను కంటిన్యూ చేస్తున్నాడు తరుణ్ భాస్కర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here